1 నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపస మందార నాకు దయసేయగదే!
2 . ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానే యైన వా
డెవ్వడు , వానినాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ !
3 . శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షాకారంభకు భక్తపాలన కళాసారంభ కున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్ద్రుగ్జాల సంభూతనా
నాకంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !
4 . ఆతత సేవజేసేద సమస్త చరాచర భూతసృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతా నికరనేతకు గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ !
5 . లావొక్కిం తయు లేదు ధైర్యము విలోలం బయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితః పరంబెరుగా మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి