20 నవంబర్, 2009

SAMKALPA BALAM (WILL POWER)

       సంకల్పబలం  -  విజయానికి మూలం 


"మనసుంటే మార్గముంటుంది " అని సామెత. దీక్ష ,పట్టుదల ,దృఢ సంకల్పం ఉంటే మనం సాధించలేనిది లేనేలేదు.
లక్ష్య సిద్ధికి దృఢ సంకల్పం ముఖ్యం. సంకల్పం ఉంటే విజయానికి అవసరమైన ఇతర లక్షణాలు  మీలో వాటంతట అవే  వృద్ధి చెందుతాయి. ముందుగా ఆశావాదాన్ని  అలవరచుకోవాలి.  మీ ఆలోచనలన్నీ నిర్మాణాత్మకంగా ఉండాలి. చీకటిని చూసి భయపడకండి. చీకటి వెనుకే వెలుగు దాగి ఉంటుందని గుర్తించండి.  ప్రఖ్యాత ఆంగ్ల కవి  షెల్లీ ఇలా చెప్పాడు- 
     "If autumn comes 
      Can spring be far behind?"
సంకల్ప బలం ఉంటే ఆత్మబలం పెరుగుతుంది, క్రమశిక్షణ అలవరుతుంది. శారీరికంగా ,మానసికంగాను కొండంత
బలం చేకూరుతుంది . ఎట్టి అవరోధాలు ఎదురైనా ,అవాంతరాలు ఏర్పడినా మీరు వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి. భర్తృహరి కార్యసాధకుల లక్షణాలను ఇలా వర్ణించాడు-
 "ఒకచో నేలను బ వ్వలించు , నొకచో నొప్పారు పూసేజ్జపై 
  నొకచో శాకము లారగించు, నొకచో నుత్క్రుష్ట  శాల్యోదనం 
  బోకచో    బొంత ధరించు , నోక్కకతరిన్ యోగ్యాంబర శ్రేణి లె
  క్కకు రానీయదు కార్య సాధకుడు దుఖంబున్,  సుఖంబున్ మదిన్.
కార్యమును సాధించ గోరువాడు కష్టసుఖములను లెక్కచేయడు. కటువు నేలపైన పడుకుంటాడు లేదా 
హంసతూలికా తల్పం మీదనైనా నిదురించ గలడు. దొరికితే రసోపేతమైన భోజనం చేస్తాడు లేదా కందమూలాలనైన తిని తృప్తి పొందగలడు. చింకి గుడ్డలనైన ధరిస్తాడు, లేదా బంగారు పట్టు బట్టలనైన  కట్టుకుంటాడు.  కాని ఎట్టి పరిస్తితుల్లోను లక్ష్యమును విడిచిపెట్టడు.  మరో మంచి ఉదాహరణ చూడండి- 
  "తనిసిరే వేల్పులుదధి రత్నముల చేత 
    వేరచిరే ఘోర కాకోల విషముచేత 
    విడచిరే యత్నమమ్రుతంబువోదముదనుక 
    నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు ."


పాల సముద్రమును చిలికినపుడు దేవతలు అందలి  రత్నములను చూసి తృప్తి చెందలేదు. అందు పుట్టిన హాలహమను విషమును చూసి భయపడి పారిపోలేదు. అమృతమును సాధించే వరకు తమ ప్రయత్నమును విరమించలేదు. అదే విధముగా ధీరులైన వారు తమ లక్ష్యము సిద్ధించే వరకు  ప్రయత్నాన్ని విడిచిపెట్టరు.
విజయం సాధించడానికి ఆత్మస్థైర్యం తో ముందుకు సాగిపోవాలి.  ప్రతి పనికి ఒక టైంటేబుల్ వేసుకుని దాని ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలి. ఏ పనిని వాయిదా వేయకూడదు. ఒక పనిని పూర్తి చేస్తే సంతోషం కల్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకో పనిని ఉత్సాహంగా చేపట్ట గలరు. 
     ఆత్మవిశ్వాసం పెరగాలంటే మహాపురుషుల జీవితాలను అధ్యయనం చేయాలి. ఆత్మకధలు, జీవిత గాధలు చదవండి. వారిలోని మంచి గుణాలను మీరు అనుసరించండి. అనేకమంది వ్యక్తులు నిరంతర సాధనతో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపారు, చూపుతున్నారు. 

1 కామెంట్‌: